Connect with us

Telangana

BRS కు షాక్.. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు..!

తెలంగాణ హైకోర్టు శుక్రవారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై కీలక తీర్పును వెలువరించింది. గతంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అయితే, స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. పదో షెడ్యూల్‌ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులను స్పీకర్‌ ముందుకు పెట్టాలని, నాలుగు వారాల లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, సింగిల్ బెంచ్‌ ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుండి గెలిచిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు పార్టీ మారి కాంగ్రెస్‌ లో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి వివేకానంద్‌లు హైకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా, ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టును ఆశ్రయించారు. దీనితో అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపు అంశంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను స్పీకర్‌ అనుసరించడం లేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న సింగిల్ బెంచ్, సెప్టెంబర్ 9 న నాలుగు వారాల్లో పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించింది. ప్రోసిడింగ్స్ అనంతరం స్టేటర్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. లేకుంటే, హైకోర్టు సమోటోగా విచారణ జరపడం హెచ్చరించింది.

అయితే, ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 12 న వాదనలు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావు తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది. కోర్టు స్పష్టంగా చెప్పింది, స్పీకర్‌కు ఎటువంటి టైమ్ బాండ్ లేదని, ఇంకా తాజా తీర్పుతో స్పీకర్ విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోబోమని పరోక్షంగా ప్రకటించింది. తుది నిర్ణయం స్పీకర్‌కే వదలిపెట్టడంతో, పార్టీ మారిన ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట కలిగినట్లయింది.

Loading

Advertisement

Trending