Connect with us

Andhra Pradesh

ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్.. ఇంకో రెండేళ్లు వేర్వేరుగా ఉండాల్సిందే

వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలు ఏమైనా చేస్తారేమో అని రక్షణ కోసం పోలీసుల దగ్గరకు వెళ్లారు. కానీ వాళ్లకి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. శుభమా అని పెళ్లి చేసుకొని వస్తే.. పోలీసులు చెప్పిన మాటతో షాక్ అయ్యారు. కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామకు చెందిన అబ్బాయి, అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. గురువారం ఈ జంట పెళ్లి చేసుకుని పెడన పోలీసుస్టేషన్‌కు వెళ్లారు.. తమకు రక్షణ కావాలని కోరారు. పోలీసులు వారిద్దరి వివరాలు, వయసు గురించి ఆరా తీశారు. అప్పుడే అసలు విషయం తెలిసింది.. ఈ ఇద్దరిలో వరుడు మైనర్‌.. ఇక వధువు ఏమో మేజర్ అని చెప్పారు పోలీసులు.

అయితే అమ్మాయి డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది.. అబ్బాయి ఏమో ఇంటర్ వరకు చదివి అక్కడితో ఆపేశాడు. వధువుకు 18 ఏళ్లు నిండగా.. వరుడికి 19 ఏళ్లు కావడంతో.. పోలీసులు ఇరువైపులా పెద్దల్ని పిలిపించి మాట్లాడారు.. ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే చట్టం ప్రకారం.. పెళ్లి విషయంలో 21 ఏళ్లు దాటే వరకు యువకుల్ని మైనర్‌గా పరిగణించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ పెళ్లి వ్యవహారంలో కేసు నమోదు చేయాలా లేదా, కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించాలా అన్న దానిపై ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అయితే వివాహం చేసుకున్నా సరే వారిద్దరు దూరంగా ఉండాల్సిందే అంటున్నారు. చట్టం ప్రకారం ఆ అబ్బాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాతే భార్యతో కలిసి జీవించాలి. అంటే ఇంకో రెండేళ్ల వరకు దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు.

మహిళల వివాహ వయస్సుపై చర్చ జరుగుతోంది.. మన దేశంలో మహిళల వివాహ వయస్సు 18 ఏళ్లు కాగా.. ఆ వయస్సును 21 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే యువతులకు 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే చట్టంలో మార్పులు చేసి 21 ఏళ్లకు పెంచాయి. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్ ఉంది.

Loading

Advertisement

Trending