Connect with us

Latest Updates

ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవరాయ్ మరణించారు..

ప్రధాని ఆర్డిక సలహా మండలి ఛైర్మన్, ప్రముఖ ఆర్ధికవేత్త పద్మ శ్రీ వివేక్ దేవరాయ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. వివేక్ దేవరాయ్ పుణేలోని గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్ అండ్ ఎకనమిక్స్ ఛాన్సెలర్‌గానూ, 2019 జూన్ 5 వరకు నీతి ఆయోగ్ సభ్యుడిగానూ ఉన్నారు. భారత ఆర్దిక వ్యవస్థకు ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో గౌరవించారు. భారత ఆర్ధిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆర్ధిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు, రచనలు చేశారు. పలు పత్రికలకు సంపాదకీయాలు కూడా రాశారు.

స్థూల అర్ధశాస్త్రం, పబ్లిక్ ఫైనాన్స్‌లో నిపుణులైన దేవరాయ్.. ఆర్ధిక సంస్కరణలు, పరిపాలన, రైల్వేల గురించి విస్తృత అంశాలను చర్చించారు. వీటితో పాటు మహాభారతం, భగవద్గీతను సంస్కృతి నుంచి అనువాదం చేశారు. 1955 జనవరి 25న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జన్మించిన వివేక్ దేవరాయ్.. కలకత్తా, ఢిల్లీ యూనివర్సిటీలలో ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తిచేశారు.  కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో అకడమిక్ కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ 1979 నుంచి 1984 వరకు విధులు నిర్వర్తించి.. తర్వాత పుణే గోఖేల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 1987 వరకు సేవలు కొనసాగించారు. అనంతరం ఢిల్లీ లోని విదేశీ వాణిజ్య సంస్థకు వెళ్లారు.

1993లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, కేంద్ర ఆర్దిక శాఖ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. ఆ సమయంలో న్యాయపరమైన మార్పుల కోసం కృషి చేశారు. ఆర్థిక విషయాలు, జాతీయ ఆవిష్కృత ఆర్థిక పరిశోధన మండలిలో, రాజీవ్ గాంధీ సమకాలీన అధ్యయనాల సంస్థలో వివిధ పదవులు చేపట్టారు. 2006 వరకు పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్‌తో పనిచేసి, తరువాత కేంద్ర విధాన పరిశోధన విభాగంలో చేరారు, 2007 నుంచి 2015 వరకు ఉన్నారు. తరువాత ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పడిన నీతి-అయోగ్‌లో సభ్యుడిగా నియమించబడ్డారు. జూన్ 2019లో ప్రధాని ఆర్థిక సలహా మండలిలో సభ్యుడిగా నియమించబడి, ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు.

వివేక్ దేవరాయ్ మరణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుఖం వ్యక్తం చేశారు. ‘డాక్టర్ వివేక్ దేవరాయ్ జీ ఒక ఉన్నతమైన పండితుడు.. ఆర్థశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత ఒకటేమి విభిన్న రంగాలలో మంచి ప్రావీణ్య ఉంది… తన రచనల ద్వారా భారత మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు. ప్రజా విధానానికి ఆయన చేసిన పని ప్రత్యేకంగా, ప్రాచీన గ్రంథాలపై పరిశోధనలు చేసి ఆనందం పొందారు. వాటిని యువతకు అందుబాటులో ఉంచారు అని ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆయన మరణంపై దుఖం వ్యక్తం చేశారు.

Advertisement

Loading

Trending