Connect with us

Latest Updates

ఎన్నికల్లో ఘన విజయం..ఆంధ్రా అల్లుడిపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..

ఎన్నికల్లో ఘన విజయం..ఆంధ్రా అల్లుడిపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌ భారీ విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పటికే ఆయన 270 ఓట్లు దాటిన ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే తుది ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్న ఆధిక్యం చూస్తే ట్రంప్‌ గట్టిగానే కొట్టినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన విజయం తర్వాత తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తనను గెలిపించినందుకు అమెరికా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్లు గెలవాల్సి ఉండగా, ట్రంప్ ఆ 270 ఓట్లు సాధించారు. దీంతో ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్ విజయం తర్వాత తన మద్దతుదారులకు ప్రసంగం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెషన్ సెంటర్‌లో మాట్లాడుతూ, ఇది గొప్ప విజయమని, ఈ విజయాన్ని అందించినందుకు అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు. స్వింగ్ రాష్ట్రాల్లో విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అమెరికా ఇలాంటి గెలుపు ఎన్నడూ చూడలేదని, అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందని అన్నారు. ఎన్నికల సమరంలో రిపబ్లికన్‌లు గొప్పగా పోరాటం చేశారన్నారు.

రిపబ్లికన్లకు 315 ఎలక్టోరల్ ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్‌ పార్టీ హవా కొనసాగిందని చెప్పారు. ఈ సందర్భంగా వైస్-ప్రెసిడెంట్ అభ్యర్ధి, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. వేదికపై మెలానియా ట్రంప్ పక్కన నిల్చున్న వాన్స్, ఉషాలను చూస్తూ.. ‘నేను ముందుగా వైస్-ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జేడీ వాన్స్.. ఆయన భార్య, అద్భుతమైన మహిళ ఉషా చిలుకూరి వాన్స్‌కు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఎవరూ ఊహించని ఆటంకాలను అధిగమించి మేము విజయం సాధించి, ఒక కారణం కోసం చరిత్ర సృష్టించాం.. ఇది మన దేశం మునుపెన్నడూ చూడని రాజకీయ విజయమని’ ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే, తనకు తొలి నుంచీ మద్దతుగా ఉన్న ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌ను ఆయన ప్రసంశలతో ముంచెత్తారు. ఇక, ట్రంప్ సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీ… పెన్సిల్వేనియా, కన్సాస్‌, జార్జియా, అయోవా, నార్త్‌ కరోలినా, మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, సౌత్‌ డకోటా, టెక్సాస్‌, నెబ్రాస్కా, ఓక్లహోమా, వయోమింగ్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, మిస్సోరి,  ఇండియానా,మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, ఐడహో,  అలబామా, సౌత్‌ కరోలినా, కెంటకీ, టెన్నెసీ, ఫ్లోరిడా, రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. అటు, స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్‌నే ప్రజలు ఆదరించారు. ఇక్కడ తటస్థంగా ఉండే ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపితే వారికే అధ్యక్ష పీఠం దక్కుతుంది. ఇస్పుడు కూడా ఇదే సంప్రదాయం కూడా కొనసాగింది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు కమలా హ్యారిస్‌, ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని భావించారు. కానీ,సమయం గడిచేకొద్దీ ట్రంప్ హవా కొనసాగింది. దీంతో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

Loading

Trending