Connect with us

Latest Updates

వీడియో బయటపెట్టిన ఇజ్రాయెల్.. చనిపోతూ హీరో అయిన హమాస్ చీఫ్ సిన్వర్..

ఇజ్రాయెల్‌‌, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్‌ ‌అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. హమాస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి యాహ్యా సిన్వరే. హమాస్‌ మిలిటరీ విభాగంలో అతడు కీలక వ్యక్తి. శత్రువును అంచనా వేయడంలో దిట్ట. అలాంటి సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మట్టుబెట్టడం సంచలనంగా మారింది. దీన్నొక గొప్ప విజయంగా భావిస్తున్న ఇజ్రాయెల్.. ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ఒక వీడియోని బయటపెట్టింది.

సిన్వర్ చివరి క్షణాలను ఇజ్రాయెల్ డ్రోన్ రికార్డు చేసింది. కానీ, ఇక్కడ సీన్ రివర్సైంది. ఆ వీడియోని చూసినవాళ్లు సిన్వర్ సింహంలా చనిపోయాడంటూ అతడి అభిమానులు ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు. అయితే చనిపోవడానికి ముందు సిన్వర్‌ కదలికలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీడియో విడుదల చేసి ఇజ్రాయెల్ తప్పు చేసిందనే వాదన వినిపిస్తోంది. ఈ విజువల్స్ వల్ల సిన్వర్ హీరో అయిపోయాడని అంటున్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడిలో శిథిలమైన భవనంలోని మొదటి అంతస్తులో ఒక సోఫాలో సిన్వర్‌ కూర్చుని ఉన్నాడు.. అప్పుడే డ్రోన్ అతడిని చిత్రీకరించింది. డ్రోన్ తన సమీపంలోకి రావడాన్ని గమనించిన సిన్వర్.. ఓ కర్ర లాంటి వస్తువును తీసుకొని దానిపైకి విసిరినట్లుగా వీడియోలో ఉంది.

అయితే ఈ డ్రోన్ విజువల్స్‌ను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్ అంతర్జాతీయ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నాదవ్ షోషాని సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. తలకు కుఫియే ధరించి తీవ్ర గాయాలతో శిథిలాల మధ్య సోఫాలో కూర్చున్న సిన్వర్ స్టిల్‌‌ను హమాస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాళ్ళు దానిని చూసి ‘సిన్వర్ సింహంలా కూర్చున్నాడు. చనిపోతానని తెలిసినా ఆయనలో గాంభీర్యం చెక్కుచెదరలేదు. ఒక లెజెండ్‌లా అమరుడయ్యాడు’ అంటూ హమాస్ మద్దతుదారులు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో వల్ల సిన్వర్ హీరో అయిపోయాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు ఒకవేళ ఇజ్రాయెల్ ఈ వీడియోని విడుదల చేయకుండా ఉండుంటే సిన్వర్ చివరి క్షణాలు ఎవరికీ తెలిసేవి కాదనేది హమాస్‌ను వ్యతిరేకించేవారి వాదన.

ఇక సిన్వర్ వీడియోపై ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ మాట్లాడారు. శిథిలమైన భవనం లోపల హమాస్‌ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి డ్రోన్‌ను పంపించామని.. సోఫాలో ఉన్న వ్యక్తిని మొదట తాము సిన్వర్‌ అనుకోలేదని అన్నారు. కేవలం ఒక మిలిటెంట్‌ అని అనుకోని.. ఆ తర్వాత ఆ భవనంపై మరోసారి బాంబు దాడి చేశామని చెప్పారు. దీంతో భవనం కుప్పకూలి అతడు మరణించాడని చెప్పారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే అతడు సిన్వర్‌ అని తెలిసిందని.. అతడి శరీరంపై బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌, గ్రనేడ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

సిన్వర్ మరణాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇజ్రాయెల్ DNA టెస్ట్ చేసింది. గతంలో ఇజ్రాయెల్ కస్టడీలో సిన్వర్ ఉన్నప్పుడు అతడి DNA నమూనాలు సేకరించారు. తాజాగా చనిపోయింది సిన్వరా? కాదా? అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పుడు సేకరించిన DNA నమూనాలను పాత నమూనాలతో పరీక్షించింది. ఇక రెండు నమూనాలు ఒకటే కావడంతో సిన్వర్ మరణాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు.

Advertisement

Loading

Trending