Connect with us

Telangana

బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని ఇలాంటి పని చేస్తారా..?

జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదనే కోపంతో హోటల్ యజమానిపై ఓ యువకుడు సలసల కాగే వంట నూనెను పోశాడు. ఈ ఘటనలో హోటల్ యజమానితో పాటు హోటల్‌కు వచ్చిన ఓ కస్టమర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నెలో బుజ్జన్న గౌడ్ అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు.

ఇదే గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం హోటల్‌కు వెళ్లాడు. తనకు బజ్జీలు ఉద్దెర ఇవ్వాలని బుజ్జన్నను కోరాడు. అందుకు బుజ్జన్న ఒప్పుకోలేదు. గతంలో ఉన్న బాకీనే తీర్చలేదని.. ఆ డబ్బులు ఇవ్వకుండా మళ్లీ ఉద్దెర అంటే కుదరదని చెప్పాడు. తాను బజ్జీలు ఇవ్వనని వినోద్‌కు తెగేసి చెప్పాడు. దీంతో వినోద్ బుజ్జన్నపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. తనకు బజ్జీలు ఎందుకు ఇవ్వవని ఆయనతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వివాదానికి దారి తీసింది.

విచక్షణ కోల్పోయిన వినోద్.. పొయ్యి మీద బజ్జీల వేసేందుకు పెట్టిన వేడి నూనెను బుజ్జన్నపై పోశాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో కస్టమర్ వీరేష్ అనే వ్యక్తిపై కూడా వేడి నూనె పడింది. ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఘటనపై బుజ్జన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. బజ్జీలు ఉద్దెర ఇవ్వకపోతే ఇటువంటి పని చేయటం ఏంటని స్థానికులు వినోద్‌పై మండిపడుతున్నారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియక వినోద్ వేడి నూనె పోశాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. బుజ్జన్న పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించటం సరికాదని అంటున్నారు. గతంలో ఇచ్చిన ఉద్దెర బాకీ చెల్లించకపోగా.. కొత్త అరువు కోసం ప్రాణాలు తీయటానికి సిద్ధపడటం దారుణమని మండిపడుతున్నారు.

Advertisement

Loading

Trending