Andhra Pradesh
“ఏపీ పరిపాలనకు బలం: రాష్ట్రానికి కొత్తగా ఎనిమిది మంది ఐఏఎస్‌లు కేటాయించిన కేంద్రం”
ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు మరింత బలం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన మరో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ఏపీ క్యాడర్‌కు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు అధికారిక లేఖ పంపింది. ఈ నియామకాలతో రాష్ట్రంలో పరిపాలనా పనితీరు మరింత వేగవంతం కానుంది.
ఈ కొత్తగా కేటాయించిన అధికారుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఏపీకి వచ్చిన ఈ 8 మంది అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి—
బన్నా వెంకటేష్, ఏ.ఆర్. పవన్ తేజ (ఏపీ), కే. ఆదిత్య శర్మ, చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), హరి ఓం పాండియా (రాజస్థాన్), నమ్రతా అగర్వాల్ (హర్యానా), ప్రియ (ఢిల్లీ), సుయశ్ కుమార్ (ఉత్తర్‌ప్రదేశ్)
అంతేకాకుండా రెండుగురు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులను ఇతర రాష్ట్రాలకు మళ్లించారు. చెన్నం రెడ్డి శివగణేష్ రెడ్డిని ఏజీఎంయూటీ పేర్కొన్న క్యాడర్‌కు, పీ. సురేష్ తెలంగాణ క్యాడర్‌కు కేటాయించి తరలించారు.
2024 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో టాపర్లకు క్యాడర్ కేటాయింపు కూడా పూర్తయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శక్తి దుబే ఆల్ ఇండియా ర్యాంక్–1 సాధించి, తన స్వంత రాష్ట్ర క్యాడర్‌ను పొందింది. అదే విధంగా, రెండో ర్యాంకర్ హర్షిత గోయల్‌కు గుజరాత్, మూడో ర్యాంకర్ అర్చిత్ పరాగ్‌కు కర్ణాటక కేడర్లు కేటాయించారు. టాప్ 10లో ఆరుగురికి స్వస్థల క్యాడర్ రావడం ప్రత్యేకత. ఈసారి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మహిళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం ఎంపికైన 1,009 మందిలో 284 మంది మహిళలు చోటు చేసుకోగా, టాప్ 25లోనే 11 మంది మహిళలు మెరిశారు. టాప్ 5లో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం. దేశంలో అత్యంత సవాళ్లతో కూడిన ఈ పరీక్షకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు.
#APCadre #IAS2025Batch #CivilServices2024 #UPSCUpdates #APGovernment #BureaucracyNews #IndiaAdministration #IASAllocation #UPSCResults #WomenInUPSC #APNews #GovernmentJobsIndia #IASOfficers
![]()
