Connect with us

Telangana

విష ప్రయోగంతో వీధికుక్కల హత్య.. రంగారెడ్డిలో కలకలం, సర్పంచ్‌పై FIR

ఎన్టీఆర్ జిల్లాలోని వెలగలేరు గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

తెలంగాణలో కొన్ని గ్రామాల్లో వీధికుక్కల సమస్య ఎక్కువగా ఉంది. ప్రజాప్రతినిధులు శాస్త్రీయ పరిష్కారాలు వెతకాలి. కానీ, వారు అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడిని ఆసరాగా చేసుకుని వీధికుక్కలను విషం పెట్టి చంపించేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వందలాది వీధికుక్కలు ఇలా బలైపోయాయి.

హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఒక ఘటన జరిగింది. ఈ ఘటన రాష్ట్రం అంతా కలకలం రేపుతోంది. యాచారం గ్రామంలో దాదాపు 100 వీధికుక్కలకు విషం ఇచ్చి చంపినట్లు చెబుతున్నారు.

ఈ అమానుష ఘటనపై ఒక జంతు సంక్షేమ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వచ్చి విచారణ చేశారు. తర్వాత గ్రామ సర్పంచ్ మరియు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు వీధికుక్కల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వీధికుక్కల సంఖ్యను నియంత్రించడానికి శాస్త్రీయమైన మార్గాలైన స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను అమలు చేయడం లేదు. బదులుగా, సులభమైన కానీ క్రూరమైన మార్గాన్ని ఎంచుకున్నారని విమర్శలు వస్తున్నాయి. చనిపోయిన కుక్కలను రహస్యంగా పాతిపెట్టినట్లు కూడా సమాచారం ఉంది.

ఇది ఒక్క యాచారం ఘటన మాత్రమే కాదు. గతంలో హన్మకొండ జిల్లాలోని రెండు గ్రామాల్లో 120కిపైగా కుక్కల కళేబరాలు వెలికితీయగా, కామారెడ్డి జిల్లాలో కూడా దాదాపు 100 వీధికుక్కలను ఇదే తరహాలో చంపేశారు. గ్రామస్థాయిలో అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపించడంతో ఇలాంటి అమానుష ఘటనలు వరుసగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసుల్లో నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

నిపుణులు వీధికుక్కల సమస్యకు హత్యలు పరిష్కారం కాదని చెబుతున్నారు. కుక్కల జనాభాను నియంత్రించాలంటే నిరంతర స్టెరిలైజేషన్ మరియు రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు తప్పనిసరి. కానీ గత రెండు సంవత్సరాలుగా అధికారులు ఏమీ చేయకపోవడంతో గ్రామాల్లో ఈ సమస్య మరింత పెరిగింది. స్థానికులు ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల అమలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. వీధికుక్కలకు ఆహారం పెట్టే వారిపైనా బాధ్యత, జవాబుదారీతనం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగా ఒకవైపు సామాన్యుల ప్రాణాలు ప్రమాదంలో పడుతుంటే.. మరోవైపు మూగజీవాలు దారుణ హత్యలకు గురవుతున్నాయి.

#StrayDogs #AnimalCruelty #TelanganaNews #Yacharam#DogKilling #SaveStrayDogs #AnimalRights#StreetDogsIssue
#PanchayatElections #Sarpanch #StopAnimalCruelty#Sterilization #VaccinationForDogs #SupremeCourt#JusticeForAnimals

Loading