Devotional
మేడారం జాతరలో వినూత్న వ్యాపారం.. అవసరాలే ఆదాయంగా మారాయి!
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సమ్మక్క–సారలమ్మ గద్దెలపై కొలువుతీరిన నాటి నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగింది. సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి బారులు తీరుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి, సమ్మక్క–సారలమ్మలకు బెల్లం సమర్పిస్తూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నారు.
ఇక జాతర వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వినూత్న వ్యాపార ఆలోచనలతో సొమ్ము చేసుకుంటున్నారు. కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లు, భక్తుల అవసరాలే లక్ష్యంగా కొత్త కొత్త ఉపాధి మార్గాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే జంపన్న వాగు వద్ద 50 రూపాయలకు బకెట్ వేడి నీళ్లు అమ్మడం చర్చనీయాంశంగా మారగా, తాజాగా సెల్‌ఫోన్ ఛార్జింగ్ వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జాతర ప్రాంతంలో ఫోన్లను ఛార్జ్ చేయడానికి సౌకర్యాలు లేవు. కాబట్టి, కొంతమంది వ్యక్తులు ఫోన్ ఛార్జింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. వారు ఒక్కో ఫోన్‌కు గంటకు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు. వారు రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నారు. భక్తులు తమ ఫోన్ బ్యాటరీ తీరిపోతుందని భయపడుతున్నారు. అందువల్ల, వారు ఈ కౌంటర్ల వద్ద నిలబడి ఉన్నారు.
అలాగే, జంపన్న వాగు స్నాన ఘట్టాల వద్ద ‘బ్యాగుల కాపలా’ అనే వ్యాపారం జరుగుతోంది. వారు ఒక్కో బ్యాగుకు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు. భక్తుల సామానును కాపాడుతూ ఉపాధి పొందుతున్నారు.
మేడారం జాతరకు వచ్చే భక్తులు ట్రాఫిక్ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడారం వెళ్లే ప్రధాన మార్గాల్లో దాదాపు 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాల్లోనే ఉండిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ఆర్టీసీ బస్సులపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేదని, పోలీస్ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
భక్తి, ఆచారం, వ్యాపారం అన్నీ మేళవించిన మేడారం జాతరలో ఒకవైపు అమ్మవార్ల మహిమ దర్శనమిస్తే, మరోవైపు మనిషి సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనంగా ఈ వినూత్న వ్యాపారాలు నిలుస్తున్నాయి.
#MedaramJathara#SammakkaSaralamma#DevoteesRush#JatharaBusiness#PhoneChargingBusiness#BagSecurity#JampannaVagu
#TrafficJam#TelanganaNews
![]()
