Connect with us

Andhra Pradesh

భోగాపురం దిశగా వేగవంతమైన మార్గం.. ఆరు వరుసల హైవేతో అరగంట ప్రయాణం!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రారంభించబోతోంది. దీనికి కౌంట్‌డౌన్ మొదలైంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎయిర్‌పోర్ట్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు కనెక్టివిటీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఆరు వరుసల రహదారి నిర్మాణంపై లోతైన సమీక్ష నిర్వహించారు.

విశాఖ నగరం నుండి విమానాశ్రయానికి వెళ్ళే మార్గం సులభంగా మరియు వేగంగా ఉండాలని ఈ కొత్త రహదారిని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లతో పోల్చితే, ఈ ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్ రహదారి ప్రయాణ సమయాన్ని బాగా తగ్గిస్తుంది. ఈ రహదారి పూర్తయితే, విశాఖ నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం అరగంట నుండి 45 నిమిషాల్లో చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ హార్బర్ నుంచి భీమిలి మీదుగా, నేరెళ్లవలస దాటి భోగాపురం వరకు రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అయితే భీమిలి ప్రాంతంలో రహదారి ఎక్కువ మలుపులు తిరగడం, ఇళ్లకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడటంపై తాజా సమీక్షలో ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బాధితులు నష్టపోకుండా, రోడ్డును వీలైనంత నేరుగా ఉండేలా మార్పులు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

భీమిలి టౌన్ వెంట లేదా బీచ్‌కు దగ్గరగా రోడ్డు మార్గాన్ని మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. బీచ్ రోడ్డును చాలా విస్తరిస్తే ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సుమారు 200 అడుగుల వెడల్పు ఉండే రోడ్డు నిర్మాణం చేస్తే స్థానిక ప్రజల్లో ఆందోళనలు పెరగవచ్చని అంచనా. దీంతో వీలైన ప్రాంతాల్లో మాత్రమే విస్తరణ చేపట్టాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

వాస్తవానికి గతంలో టీడీపీ ప్రభుత్వం బీచ్‌కు దగ్గరగా రహదారి వేస్తే తక్కువ ఇళ్లకు నష్టం జరుగుతుందని భావించింది. కానీ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలతో అలైన్‌మెంట్ మారింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఆదేశాలతో పాత ప్రతిపాదనలపై పునఃపరిశీలన జరుగుతోంది. ఖరగ్‌పూర్ నుంచి శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు మీదుగా భోగాపురం–విశాఖ వరకు ప్రతిపాదించిన కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేలో భాగంగానే ఈ ఆరు వరుసల రహదారి నిర్మాణం జరగనుంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముందే ఈ రహదారి ప్రణాళికపై స్పష్టత రావాలని ప్రభుత్వం భావిస్తోంది. కనెక్టివిటీ మెరుగుపడితే… ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని అధికార వర్గాలు విశ్వసిస్తున్నాయి.

#BhogapuramAirport#Visakhapatnam#ChandrababuNaidu#SixLaneRoad#AirportConnectivity#APDevelopment#VizagToBhogapuram
#ExpressHighway#InfrastructureDevelopment#AndhraPradesh

Loading