Connect with us

Telangana

ప్రమాదాలకు చెక్ పెట్టే ఎలివేటెడ్ కారిడార్.. ఈ ప్రాంతంలో నిర్మాణం

మెదక్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణం ఇకపై కొంచెం ఊరట కలిగించేలా మారనుంది.

మెదక్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణం ఇకపై కొంచెం ఊరట కలిగించేలా మారనుంది. ఎన్నో ప్రాణాలను బలిగొన్న జాతీయ రహదారి 765-డీపై ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నర్సాపూర్ నుంచి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వరకు ఉన్న దట్టమైన అటవీ మార్గంలో సుమారు 10 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ అటవీ మార్గంలో రోడ్డు విస్తరణ అనేది అంత సులువు కాదు. అటవీ శాఖ అనుమతులు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. అందుకే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా, ప్రయాణ సమయాన్ని కూడా తగ్గించేలా రెండు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకవైపు ప్రస్తుతం ఉన్న రహదారిని ఇరువైపులా విస్తరించి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడం ఉంటే, మరోవైపు ఒక్క చెట్టుకూడా నరకాల్సిన అవసరం లేకుండా పిల్లర్లపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్న ఆలోచన ఉంది.

ఈ విషయంలో స్థానిక ఎంపీ రఘునందన్‌రావు ఎలివేటెడ్ కారిడార్‌కే మద్దతు ఇస్తున్నారు. ఇది అమలులోకి వస్తే అడవులు కాపాడబడతాయన్నది ఒక వైపు అయితే, ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు కిలోమీటరుకు సుమారు రూ.150 కోట్లు ఖర్చవుతుందని, మొత్తంగా రూ.1,000 నుంచి రూ.1,500 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ నుంచి రాంపూర్ వరకు ఉన్న 62.92 కిలోమీటర్ల జాతీయ రహదారిలో గుమ్మడిదల వరకు మాత్రమే నాలుగు వరుసల రహదారి ఉంది. అక్కడి నుంచి నర్సాపూర్ వరకు వెళ్లాలంటే రెండు వరుసల రోడ్డుపైనే ప్రయాణించాల్సి వస్తోంది. అదనంగా ఈ అటవీ ప్రాంతంలో సుమారు 25 ప్రమాదకరమైన మలుపులు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డివైడర్ లేకపోవడం, రోడ్డు నిర్మాణంలో లోపాల కారణంగా ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, మలుపుల వద్ద అదుపు తప్పి లోయల్లో పడిపోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

ఈ సమస్య తీవ్రతను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా, ప్రజల ప్రాణాలు కాపాడేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్‌లను కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు.

ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే హైదరాబాద్–మెదక్ మధ్య ప్రయాణం మరింత సాఫీగా సాగడమే కాదు, రోడ్డు భద్రత కూడా గణనీయంగా మెరుగుపడనుంది. అదే సమయంలో ఈ ప్రాంతానికి పర్యాటకంగా కూడా కొత్త ఊపొచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

#MedakHyderabadHighway#NH765D#ElevatedCorridor#RoadSafety#AccidentFreeRoads#ForestCorridor#GreenInfrastructure
#Narsapur#Gummadidala#Sangareddy#TelanganaDevelopment#NitinGadkari#RaghunandanRao#SafeTravel#NationalHighways

Loading