Connect with us

Telangana

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి. గత 10 రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన వరుణుుడు మళ్లీ విజృంభిస్తున్నాడు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రానికి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 23 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని..ఈ నేపథ్యంలోనే నేటి నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణలో వర్షాలుకు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. నేడు (సెప్టెంబర్ 21) సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ప్రజలు అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఇక అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, కర్నూలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటుగా పిడుగులు పడే ఛాన్స్ ఉందని.. పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Loading

Advertisement

Trending