Connect with us

Andhra Pradesh

ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఇటు సేవలు, అటు ఉద్యోగ భద్రత

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్న 155 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చర్యతో లబ్ధిదారుల సేవలు విస్తరించడమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తల ఆర్థిక భద్రతకు కూడా ఊతం లభించనుంది.

ప్రస్తుతం మినీ అంగన్వాడీ కేంద్రాలు పరిమిత సదుపాయాలు, ఒక్క కార్యకర్తతోనే కొనసాగుతున్నాయి. చిన్నారుల సంఖ్య, లబ్ధిదారుల వివరాలు, సేవల అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చుతోంది. ప్రకాశం జిల్లాలో ఎంపిక చేసిన 155 మినీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయగా, మరో 12 కేంద్రాలను సమీపంలోని అంగన్వాడీలలో విలీనం చేశారు.

ఈ మార్పుతో బాలింతలు, గర్భిణులు, మూడేళ్ల లోపు చిన్నారులకు అందే పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణ, ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమాలు మరింత సమర్థంగా అమలవుతున్నాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో సేవలు నిలిచిపోకుండా ఉండేందుకు ప్రతి మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో సహాయకురాలిని నియమిస్తున్నారు.

ఇది ముఖ్యంగా ఉద్యోగుల పరంగా కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.7,000 వేతనం అందుతుండగా, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత కార్యకర్త వేతనం రూ.11,500కు పెరుగనుంది. అదనంగా నియమించే సహాయకురాలికి నెలకు రూ.7,000 జీతం చెల్లించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో తల్లీబిడ్డ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వాటిని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మరింత పెంపొందుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇందులో భాగంగా జరుతున్న అప్‌గ్రేడేషన్ ప్రక్రియతో అంగన్వాడీ సేవల్లో నాణ్యత పెరిగి లబ్ధిదారులకు మెరుగైన ఫలితాలు అందుతున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

#AnganwadiCenters#APGovernment#WomenAndChildWelfare#MiniAnganwadi#MainAnganwadi#ChildCare#MaternalHealth
#AnganwadiWorkers#GovernmentSchemes#APNews

Loading